అసలు మొదలైంది వ్యాపారం కోసం!

 రక్త సంబంధీకులు కానీ ఇద్దరు ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నారంటే అది ఒక్కస్నేహానికే సాధ్యం. స్నేహంలో జాతి,కుల,మత,వర్గ,ప్రాంత, లింగ మరియు వయో భేదాలు ఉండవు. స్నేహం త్యాగానికి గుర్తు. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా  స్నేహితుల దినం జరుపుకుంటారు. అసలు ఈ స్నేహితుల రోజు ఎలా ప్రారంభమైందో చూద్దాం.నిజానికి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం 1930లో ఫక్తు మార్కెట్‌ వ్యూహాలతో మొదలైంది. హాల్‌మార్క్‌ గ్రీటింగ్‌ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్‌ హాల్‌ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత 1958లో పరాగ్వేలో వరల్డ్‌ ఫ్రెండ్‌షిప్‌ క్రూసేడ్‌ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించగా.. క్రమంగా చాలా దేశాలు దీన్ని పాటించడం మొదలుపెట్టాయి. భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్‌ దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. పాకిస్తాన్‌లో మాత్రం జూలై 30న చేసుకుంటారు. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20న నిర్వహిస్తారు.