హైదరబాద్:    పనిచేయుంచుకొని జీతాలివ్వటం తెలుసు. ఈ మోసగాళ్ళు పనీ చేయించుకుంటారు, డబ్బులుకూడా తీసుకుంటారు. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ పేరిట నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేసిన ఇద్దర్ని ఆదివారం మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మన్మోహన్‌, ఎస్సై సంజీవరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం,  చిలకలగూడ ఆలుగడ్డబావికి చెందిన మునుకుల షాలిని (24) బీకాం చదువుకుంది. ఆమె అంతకుముందు చేసిన ఉద్యోగంలో  డబ్బులు కట్టించుకుని కాగితాలపై నంబర్లు వేయించుకుని చెల్లింపులు చేసే పద్ధతిని గమనించింది. నెలరోజులు అక్కడ పనిచేసి ఉద్యోగం మానేసింది. 

కష్ట పడకుండా డబ్బులు సంపాదించటానికి,  ‘వర్క్‌ ఫ్రం హోం’ పేరిట కార్యాలయాన్ని,  కార్ఖానాలో జూన్‌లో ప్రారంభించింది. నిరుద్యోగులు, డిగ్రీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి ముందుగా రిజిస్ట్రేషన్‌ కోసం రూ.2,500 కట్టించుకుని సభ్యులుగా చేర్చుకుంది. ఐడీ కార్డు కోసం మళ్ళీ డబ్బులు వసూలు చేసింది. తెల్లకాగితానికి ఇరువైపులా గళ్లు గీయించి వెయ్యి నంబర్లు వరుసగా తప్పుల్లేకుండా వేయాలని సూచించేది. ఇలా ప్రతిఒక్కరికి 90 పేపర్లు ఇచ్చి సక్రమంగా వేసిన వారికి పేపరుకు రూ.50 చొప్పున ఇచ్చేది. ఈ పని తేలికగా ఉండటంతో దాదాపు వందమంది సభ్యులుగా చేరారు. అయినంత వరకు వసూలు చేసుకొని, బోర్డు తిప్పేసి  జులైలో ఆర్కేనగర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. అక్కడ 80 మంది చేరారు. నంబర్లు వేసిన కాగితాలను పరిశీలించేందుకు రామంతాపూర్‌కు చెందిన బర్గే బాలరాజ్‌ (32)ను సహాయకుడిగా నియమించుకుంది. డబ్బులు కట్టి నంబర్లు సక్రమంగా వేసినా చెల్లింపులు జరగగ పోవటంతో  జరిగిన మోసం గురించి పోలీసులకు శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను, సహాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు రిజిస్టర్ చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.