అమరావతి:  మెల్లగా  ప్రత్యేక హోదా అంశం నీరుగారిపోతున్నట్లుగా కనిపిస్తుంది. విభజన సమస్యలను ప్రధాని మోడీకి వివరించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రత్యేక హోదా విషయాన్ని ప్రక్కన పెట్టినట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రధాన అజెండాగా ఈ నెల 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండనుంది. మంగళవారం ఉదయం హస్తినకు బయలుదేరి వెళ్లనున్న సీఎం అదేరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయడంతో పాటు రెవెన్యూ లోటు భర్తీ, వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంటు, రాష్ట్రంలో ఓడరేవు ఏర్పాటు తదితర అంశాలను మోదీ దృష్టికి జగన్‌ తీసుకువెళ్లనున్నారని సమాచారం.