కాశ్మీరానికి శస్త్ర చికిత్స...


భరతమాతకు కుంకుమ బొట్టులాంటి కశ్మీర్‌పై కేంద్రం కొత్త చరిత్ర లిఖించింది. నిప్పుల కుంపటిగా మారి పాలకులకు నిద్రలేకుండా చేస్తున్న ఈ రాష్ట్రానికి 370 రూపంలో ఉన్న ప్రత్యేక హోదాను శాశ్వతంగా చెరిపేసింది. అంతేకాదు.. వేర్పాటుకు ఊతమిచ్చే కశ్మీరీ రాజకీయ పార్టీలు, పాక్‌ వెన్నుదన్నుతో రెచ్చిపోతున్న ఉగ్రవాదులకు చెక్‌ పెడుతూ రాష్ట్రాన్ని రెండు యూటీలుగా విడగొట్టింది. ఒకటి: అసెంబ్లీతో కూడిన జమ్మూ- కశ్మీర్‌. రెండోది: అసెంబ్లీ లేని లద్దాఖ్‌. వారం రోజులుగా అత్యంత గోప్యంగా ఈ చారిత్రక నిర్ణయానికి దారులు సుగమం చేస్తూ వచ్చిన మోదీ-షా ద్వయం... చివరకు కశ్మీరీ సమస్య అనే రాచపుండుకు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా శస్త్ర చికిత్స చేశారు. దేశ రాజకీయ పక్షాలు అసలేం జరుగుతోందో తెలుసుకొనే లోపే బిల్లుకు ఆమోదముద్ర వేయించేశారు. 73వ స్వాతంత్య్ర దిన వేడుకలకు మరో పదిరోజులుందనగ…


పక్క ప్రణాళికతో...
కాశ్మీర్ అంశాన్ని ప్రభుత్వం చాలా వ్యూహరచన చేసి అమలు పరచింది. అందులో భాగంగా  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఈ విషయాన్ని నివేదించినట్లు అమిత్‌ షా నోట్‌ చేసుకున్నారు. సోమవారం కేబినెట్‌ సమావేశం నిర్వహించాక పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలనీ, అదే సమయంలో రాష్ట్రపతి కోవింద్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని అందులో ఉంది. అలాగే రాజ్యసభలో భద్రత విషయంలో ప్రధాని మోదీ సభ చైర్మన్‌ వెంకయ్యనాయుడితో చర్చిస్తారని ఉంది. ఇక రాజకీయ విభాగంలో అఖిలపక్ష భేటీ నిర్వహణకు పిలుపునివ్వడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని ఎన్డీయే కూటమి ఎంపీలకు వివరించాలని అమిత్‌ షా నిర్ణయించారు. ప్రధాని మోదీ ఆగస్టు 7న జాతినుద్దేశించి ప్రసంగిస్తారని జాబితాలో ఉంది. జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ మాలిక్‌తో పాటు యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడుతారని ఈ నోట్‌లో ఉంది. మరోవైపు శాంతిభద్రతల అంశానికి సంబంధించి హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబాను జమ్మూకశ్మీర్‌కు పంపాలని నిర్ణయించారు. యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా కల్పించేలా ఆయా ప్రభుత్వాలను ఆదేశించాలని జాబితాలో చేర్చారు.