ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని అమెరికా పేర్కొంది. వాస్తవాదీన రేఖ వెంబడి అన్ని పక్షాలు శాంతి, సుస్ధిరతలను పాటించాలని కోరింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను మోదీ సర్కార్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇక పాకిస్తాన్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఇండో-పాక్‌ సరిహద్దు వద్ద అన్ని పక్షాలూ సంయమనంతో వ్యవహరించాలని, శాంతి..సుస్ధిరతలను కొనసాగించాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్‌ ఒటాగస్‌ కోరారు. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి చేపడుతున్న చర్యలు పూర్తిగా అంతర్గత వ్యవహారాలని భారత్‌ పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.కాగా, అంతకుముందు ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా, బ్రిటన్‌, చైనా, రష్యా, ఫ్రాన్స్‌ రాయబారులకు వివరించింది.