వయసుతో సంబంధం లేకుండా దేశంలో పెరిగిపోయిన టిక్ టాక్ వినియోగం ఎన్నో అనర్ధాలను తెచ్చిపెడుతుందని నిపుణులు ,సామాజికవేత్తలు చెబుతున్నారు.ఇటీవల కాలంలో స్మార్ట్‌ ఫోన్‌లో టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా తీరొక్క రకాల వీడియోలు చేస్తూ..యువతీ యువకులు పరిధి దాటుతున్నారు. సరదాకు ఎప్పుడో ఒకటి రెండూ చేస్తే అంతా ఆనందిస్తారు. కానీ..దీనిని ఓ వ్యసనంలా మార్చుకుంటూ..గంటల కొద్దీ సమయాన్ని కేటాయిస్తుండడమే చిక్కులు తెస్తోంది.  విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు అనే తేడా లేకుండా..అనేకమంది ఈ టిక్‌ టాక్‌ యాప్‌ మోజ్‌లో పడిపోయారు. వీడియోలు చిత్రీకరిస్తూ పోస్టు చేస్తున్నారు. వీటికి వచ్చే లైక్‌లు, కామెంట్లతో ఉత్సాహంతో వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే వారిలో కొందరు సైతం..టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ బయట పడిన ఘటనలతో ఉన్నతాధికారుల క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు.