పన్నేండేళ్ల క్రితం వచ్చిన `మన్మథుడు` సినిమా `కింగ్` నాగార్జున కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒకటి. ఆ సినిమాకు ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయిత. ఆ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగులను ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో `మన్మథుడు-2` తెరకెక్కింది.ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో `మన్మథుడు` క్రెడిట్ మొత్తాన్ని నాగార్జున దర్శకుడు విజయ్ భాస్కర్ ఖాతాలోనే వేశారు. త్రివిక్రమ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా నాగార్జున.. ఈ విషయంపై స్పందించారు. `నాకు మన్మథుడు కథ చెప్పింది విజయ్ భాస్కర్ గారే. ఆయన రోజూ నన్ను కలిసి కథ గురించి చర్చించేవారు. నాతో పంచ్ లు చెప్పింది కూడా ఆయనే. అందుకే ఆయన గురించే మాట్లాడాను.. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్` అంటూ త్రివిక్రమ్ గురించి మాట్లాడేందుకు నాగార్జున ఇష్టపడలేదు.