ఇక అంతే సంగతులా...

ఆమరవతి: పోలవరం ప్రాజెక్టుకు మరో అడ్డంకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టకు సాయం అందించాలని ప్రధానికి కేంద్రమంత్రులకు సీఎం జగన్ వినతిపత్రాలు అందిస్తున్న సమయంలోనే ఈ షోకాజ్ నోటీసులు జారీ కావడం కలకలం రేపుతోంది. పోలవరం పనులు నత్తడకన.. అసలు జరుగుతున్నాయో లేదో అనే సందిగ్ధం ఉన్న సమయంలో 2005కి సంబంధించిన అంశంలో కేంద్రం ఈ నోటీసులు జారీ చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. 2005లో పొలవరం అనుబంధ ప్రాజెక్టులపై కేంద్రపర్యావరణ శాఖకు చెందిన చెన్నై అధికారులు తనిఖీలు నిర్వహించారు. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. ఆ కమిటీ పరిశీలన జరిపిన 14 ఏళ్ల తర్వాత కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఏమిటన్నది చాలామందికి అర్థం కాని విషయంగా మారింది.