అమరావతి:  గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీలో భాగంగా రాత పరీక్షలో అర్హత పొందని ఏఎన్‌ఎంలను వారు పని చేస్తున్న కేటగిరిలో యథావిధిగా కొనసాగించనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే గ్రామ, వార్డు సచివాలయ పోస్టుకు రాత పరీక్షలో అర్హత సాధించిన ఏఎన్‌ఎంల వేతనాల్లో అంతరంపై భవిష్యత్‌లో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. వైద్యఆరోగ్యశాఖలో ఈసీ-ఏఎన్‌ఎం, కాంట్రాక్టు ఏఎన్‌ఎం, సెకండ్‌ ఏఎన్‌ఎంలుగా ప్రస్తుతం 7,418 మంది పని చేస్తున్నారు. త్వరలో ఏర్పాటు కానున్న 9,754 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఆ 7,418 మంది ఏఎన్‌ఎంలకు రెగ్యులర్‌ ఉద్యోగావకాశం కల్పించడానికి 10% వెయిటేజ్‌ మార్కులు ఇస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది.