హైదరబాద్: టెలికమ్యూనికేషన్‌ రంగంలో 5జీ ప్రవేశంతో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుందని అమెరికన్‌ సైబర్‌ నిపుణుడు హెరాల్డ్‌ ఫర్ష్‌టాగ్‌ అన్నారు. 5జీ, సైబర్‌ భద్రత అంశాలపై రకరకాల పరిశోధనలు చేసిన హెరాల్డ్‌ ఈ అంశాలపై పలు పుస్తకాలు రాశారు. బుధవారం బేగంపేటలోని అమెరికన్‌ కాన్సులేట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాబోవు తరాలకు 5జీ వరంలా మారుతుందని అన్నారు. మనం గతంలో ఊహించనంత స్పీడ్, డేటా ట్రాన్స్‌ఫర్, అత్యాధునిక అప్లికేషన్లు, వైర్‌లెస్‌ టెక్నాలజీతో కమ్యూనికేషన్ల రంగంలో 5జీ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని తెలిపారు. 5జీ రాకతో వ్యాపార, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వాతావరణం, వర్షపాతం, ఉష్ణోగ్రత నదుల సమాచారం, జంతువుల కదలికలు, పంటలకు చీడలు తదితర వివరాలను ఇప్పటికంటే వేగంగా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు.