లండన్: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ జమ్మూకశ్మీర్‌ పరిణామాలపై స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. బోరిస్‌ జాన్సన్‌ బ్రిటన్‌ ప్రధానిగా కొత్తగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలపడానికి పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఫోన్‌చేశారని బ్రిటన్‌ విదేశాంగ అధికారులు తెలిపారు. ఈ
సందర్భంగా వీరిద్దరి మధ్య జమ్ముకశ్మీర్‌ అంశం చర్చకు వచ్చిందని స్థానిక వార్తపత్రిక వెల్లడించింది. భారత ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోందని, బ్రిటన్‌ జోక్యం చేసుకోవాలని ఇమ్రాన్‌ కోరాడని తెలిపింది. పాక్‌, బ్రిటన్‌ల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవ్వాలని ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారని పేర్కొంది. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌ కూడా జమ్మూకశ్మీర్‌ అంశంపై విలేకరులతో మాట్లాడారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో ఇదే విషయమై చర్చించానని, భారత్‌, పాక్‌లు
సమన్వయం పాటించాలని కోరారు. ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా జమ్మూకశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా లండన్‌లో భారత వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. అలాగే జమ్మూ, కశ్మీర్‌ తదితర ప్రాంతాల పర్యటనకు వెళ్లవద్దని తన దేశ ప్రజలకు బ్రిటన్‌ సూచించింది.