ఇక స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు!


దిల్లీ: భూతల స్వర్గమైన కశ్మీర్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేద్దామని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే  ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని చారిత్రక నిర్ణయంగా అభివర్ణించిన ప్రధాని.. ఆ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను, 370 రద్దు ఆవసరాన్ని, కశ్మీర్‌ అఖండ భారత్‌లో సంపూర్ణంగా భాగస్వామి కావడం వల్ల ప్రయోజనాలను టీవీలో ప్రసారమైన తన ప్రసంగంలో సుదీర్ఘంగా వివరించారు.గురువారం రాత్రి 8 గంటల నుంచి దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని.. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, శాంతియుత, సురక్షిత, సమృద్ధ కశ్మీర్‌ తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, కళ, క్రీడ, సాంస్కృతిక రంగాల్లో వారి నైపుణ్యాలకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి చూపుతామని, ఇందుకు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.