వయసు పెరుగుతున్న కొద్ది మరింత గ్లామరస్ లుక్కుతో  నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్‌ నాగార్జున. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుడే కింగ్, తాజాగా ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్‌ రొమాంటిక్‌ కామెడీని తెలుగులో రీమేక్‌ చేశాడు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి మన్మథుడుగా అలరించే ప్రయత్నం చేశాడు నాగ్‌. మరి ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? రాహుల్ దర్శకుడిగా మరో విజయాన్ని అందుకున్నాడా..?

కథ :
సామ్‌ అలియాస్ సాంబశివ రావు (నాగార్జున అక్కినేని) పోర్చుగల్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. తను ప్రేమించిన అమ్మాయి దూరం కావటంతో ప్రేమంటేనే అబద్ధమని కేవలం తన ఆనందం కోసం మాత్రమే బతకాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి చేసుకోవాలని విసిగిస్తున్నారని కుటుంబానికి కూడా దూరంగా ఉంటుంటాడు. వయసు మీద పడటంతో సామ్ తల్లి (లక్ష్మీ), కొడుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. కుటుంబమంతా కలిసి మూడు నెలలో పెళ్లి చేయాలని తీర్మానం చేస్తారు. 
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అవంతిక (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) అనే అమ్మాయిని తన ప్రియురాలిగా కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు. సరిగ్గా పెళ్లి రోజున చెప్పకుండా వెళ్లిపోవాలని అవంతికతో అగ్రిమెంట్‌ చేసుకుంటాడు. తన సమస్యల కారణంగా అవంతిక కూడా అగ్రిమెంట్‌కు అంగీకరిస్తుంది. అలా ఇంటికి వచ్చిన అవంతిక, సామ్‌ కుటుంబ సభ్యులకు దగ్గరవుతుంది. మరి అవంతిక అగ్రిమెంట్ ప్రకారం సామ్‌ ఫ్యామిలీని వదిలి వెళ్లిపోయిందా..? ప్లేబాయ్‌ లా లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న సామ్‌ మారాడా.. లేదా? అన్నదే మిగతా కథ.