హైదరాబాద్: మరో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మిడ్జిల్‌లో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు బోంపెల్లి రాజేందర్‌రెడ్డి తన వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు కోసం ముగ్గురు రైతుల పేరిట గత రెండు నెలల క్రితం డీడీ తీసి జడ్చర్ల విద్యుత్‌ కార్యాలయంలో అందజేశాడు. ఆ తర్వాత మిడ్జిల్‌ ఏఈ పర్వతాలును సంప్రదించగా.. రూ.15 వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్‌ ఇస్తానని చెప్పడంతో రైతు రూ.12 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు.
ఈ విషయమై గత నెల 30న ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఏఈ డబ్బులు డిమాండ్‌ చేసినట్లు తేలింది. దీంతో వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం రైతు నుంచి రూ.12 వేలు ఏఈ పర్వతాలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏఈపై కేసు నమోదు చేశామని, శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు లింగస్వామి, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.