శ్రావణమాసం... ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించే మాసం. నెల రోజులపాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని పండిత ఉవాచ. అంతేకాదు... ఈ నెలలో ఎన్నో పండుగలు, పర్వదినాలు. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు మహావిష్ణువుకు, ఆయన దేవేరి మహాలక్ష్మికి; లయకారుడైన పరమేశ్వరుడికి, ఆయన సతీమణి మంగళ గౌరీదేవికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం పేరుతో ఏర్పడిన మాసం కావడం వల్ల ఈ మాసం లక్ష్మీవిష్ణుల పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.