న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ నియమకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.  రాష్ట్రపతి భవన్‌ నుంచి అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోన్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్లు చేయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన విజయ్‌ కుమార్ నియమానికి రాష్ట్రపతి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు రేపోమాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో కశ్మీర్‌ తొలి ఎల్జీగా నియామకమైన అధికారిగా విజయ్‌ గుర్తింపు పొందనున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌, లఢక్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్రం తరఫున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లఢక్‌ వ్యవహారాలను గవర్నర్‌ సత్యపాల్ మాలిక్ చూస్తున్నారు. ఇప్పుడు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పాలనను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు ఆయన నియమకానికి సంబంధించి అధికారిక ప్రకటన రాకముందే సోషల్‌ మీడియాలో విజయ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుత్తున్నాయి.