ముంబై : థానేలో విషాదం చోటుచేసుకుంది. కూతురిని హతమార్చిన ఓ టీవీ ఆర్టిస్టు.. అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. ప్రాద్య్నా పర్కార్‌(40) అనే మహిళ మరాఠీ సీరియళ్లలో నటిస్తోంది. ఆమె భర్త చిన్నపాటి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి పన్నెండో తరగతి చదివే కుమార్తె శ్రుతి ఉంది. కాగా గత కొంతకాలంగా ప్రాద్య్నాకు సీరియల్‌ అవకాశాలు తగ్గిపోయాయి. అదే విధంగా భర్త కూడా వ్యాపారంలో నష్టపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భర్త జిమ్‌కు వెళ్లిన సమయంలో ప్రాద్య్నా... కూతురిని గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగొచ్చిన ఆమె భర్త తలుపు తట్టగా లోపలి నుంచి సమాధానం రాలేదు. దీంతో తలుపులు బద్దలు గొట్టగా తల్లీకూతుళ్లు విగతజీవులుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ప్రాద్య్నా భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాద్య్నా సూసైడ్‌ నోట్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.