మాస్కో: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దుపై రష్యా విదేశాంగ శాఖ స్పందించింది. భారత రాజ్యాంగం పరిధి మేరకే కశ్మీర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొంది. ఈ మేరకు...‘ జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో పరిస్థితి దిగజారకుండా భారత్‌-పాకిస్తాన్‌ దేశాలు సంయమనం పాటిస్తాయని మాస్కో భావిస్తోంది. గణతంత్ర దేశమైన భారత్‌... జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు విభజించడంలో రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించింది’ అని రష్యా ఆర్టికల్‌ 370 రద్దుపై తమ వైఖరి స్పష్టం చేసింది. కాగా జమ్మూ కశ్మీర్‌ విషయంలో నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను కట్టడి చేయాల్సిందిగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంతర్జాతీయ సమాజాన్ని కోరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం చర్యలకు నిరసనగా.. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పాక్‌ రద్దు చేసుకుంది. తమ దేశం నుంచి భారత రాయబారిని బహిష్కరించింది. అదే విధంగా ఢిల్లీలోని తమ రాయబారిని వెనక్కి పిలిపిస్తామని పేర్కొంది.