నాగపట్నంలో వెలసిన స్వామిని సౌందర్యరాజు అంటారు. నీల మేఘస్వామి  అని  కూడా అంటారు అమ్మవారు సౌందర్య వల్లి. సార పుష్కరిణి సమీపంలో, సౌందర్య విమానంలో,  స్వామివారు భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు.  తిరుమంగైఅళ్వార్లకు స్వామి ప్రత్యక్ష దర్శన భాగ్యం లభించింది. 

     ప్రసిద్ధ రేవుపట్నమైన ఈ నాగపట్నం తమిళనాట ప్రసిద్ధ నగరం. నాగరాజైన ఆదిశేషునకు  శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైన నగరం కనుక దీనికి నాగపట్నం అనే పేరు వచ్చింది. ఈ దివ్య క్షేత్రంలో వైకుంఠనాథుడు, శ్రీరామ, శయన వరదరాజ స్వామి, శ్రీనివాసుడు, పన్నెండు మంది అళ్వా ర్లకు ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి.
కృతయుగంలో ఆదిశేషుడికి, త్రేతాయుగంలో భూదేవికి, ద్వాపర యుగంలో మార్కండేయుడికి, కలియుగంలో శాలిశుక మహారాజుకు, నాగరాజుకు మొదలైనవారికి  స్వామి ప్రత్యక్షమై , వారు కోరిన వరాలు ప్రసాదించారు. భృగు మహారాజు శాపం చేత తన సౌందర్యాన్ని కోల్పోయిన పార్వతీ దేవి, అయన ఉపదేశంతో ఇక్కడ తపస్సు చేసి
తన సౌందర్యాన్ని తిరిగి పొందింది. కనుక దీనికి 'సౌందర్యారణ్యక్షేత్రం' అనే పేరు కూడా వుంది.  నాగరాజైన ఆదిశేషుడు, సంతానం కోసం ఈ స్వామిని ప్రార్ధించాడు. శ్రీహరి సంతోషించి సంతానాన్ని ప్రసాదించాడు. అందుచేత దీనికి 'నాగపట్నం' అని పేరువచ్చింది. నాగరాజు తన కూతుర్ని చోళ రాజైన శాలిశుకమహారాజుకు ఇచ్చి పెళ్ళిచేసాడు. కృతజ్ఞతగా  శాలిశుకుడు నాగపట్నం దేవాలయాన్ని పునర్నిర్మించాడు.
స్వామి ఇక్కడ శయనించిన శ్రీరంగనాథునిగా, కూర్చున్న  గోవిందరాజస్వామిగా, నిల్చున్న సౌందర్య రాజ పెరుమాళుగా దర్శనమిస్తారు. 

ఈ దివ్య పుష్కరం తీరాన బ్రహ్మ చేసిన తపస్సుకుమెచ్చి శ్రీమహావిష్ణువు తన దివ్య  సుందర రూపంతో దర్శనమిచ్చినందువల్ల ఈ స్వామి సౌందర్య రాజు అయ్యాడు. 


ఒక సారి చోళ రాజు తన భార్యని చూడటానికి నాగపట్నం వస్తూ దారి తప్పాడు. అతని మీద ఉండే అభిమానంతో స్వామి,  శయన ముద్ర నుండి లేచి కూర్చొని దారి చూపించాడు. నుంచొని చూపిస్తే ఇంకా బాగా ఉంటుంది కదా అనుకోని, తరువాత నిల్చొని దారి చూపించాడు. కనుకనే శయనించిన, కూర్చున్న, నిల్చున్న మూర్తులుగా స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు కలిగింది. విశేష ఆరాధనలు, పూజలన్నీ
నిల్చున్న మూర్తికే జరుగుతాయి. 


నాగపట్నానికి సంబంధించి మరొక గాథ కూడా ఉంది.  ఉత్తానపాదుడికి సురుచి, సునీతి అనే ఇద్దరు  భార్యలు. ధ్రువుడు సురుచి కుమారుడు. ఉత్తముడు సునీతి కుమారుడు. ఒకనాడు ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చొని ఉండగా, ధ్రువుడు కూడా తండ్రి తొడ మీద కూర్చోబోవగా, పినతల్లి సునీతి ధ్రువుడిన్ని పక్కకు లాగి, నీకు అంత
అదృష్టమే ఉంటె నా కడుపునే పుట్టేవాడివి  అని కోప్పడింది. ఈ అవమానం భరించలేని ధ్రువుడు, అడవులకు వెళ్లి శ్రీమన్నారాయణుని కోసం తపస్సు ప్రారంభించాడు. అప్పుడతని వయసు ఐదు సంవత్సరాలు. శ్రీమహావిష్ణువు అతని తపస్సుకు మెచ్చి
గరుడవాహనం  మీద ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన పుణ్యక్షేత్రమే ఈ నాగపట్నం. ఇక్కడ  అష్ట భుజాలతో నరసింహస్వామి కొలువై ఉన్నాడు. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు జగన్మోహనంగా ప్రకాశిస్తుంటారు. 

 శ్రీ నాగమల్లు జగన్నాథ నాయకర్ అనే నాయక రాజు, గొప్ప వైష్ణవ భక్తుడు. ఈ ప్రాంతం డచ్చి వారి అధీనంలో ఉన్న కాలంలో  అయన, వచ్చే,  పోయే నావలకి ఇది రేవు పట్నం అని తెలియటానికి ఒక పెద్ద దీప స్తూపం కావాలనే కారణం చూపి,  ఈ ఆలయానికి పెద్ద గోపురం కట్టించి, మండపాలను కూడా నిర్మించాడు. అయనతో పాటు  అయన భార్య అయిన లక్ష్మి అమ్మాళ్ విగ్రహాలు  కూడా వారు కట్టించిన మండపంలో
ఉన్నాయి. ఈ  దివ్యక్షేత్రం ఐదు  అంతస్థుల రాజగోపురాలతో, రమణీయ  శిల్పాలతో  అద్భుతంగా ఉంటుంది. స్వామివారి సమ్మోహన  సుందర రూపంతో సౌందర్య రాజన్ అనే పేరుకు సార్ధకత కలిగిస్తుంటారు. 
 ఏటా  జరిగే బ్రహ్మోత్సవాలు, అవతారోత్సవం, వసంతోత్సవం, అధ్యనోత్సవం, పవిత్రోత్సవం అన్నీ మహా వైభవంగా జరుగుతాయి.