కర్నూలు: కర్నూలులోని ఏపీఎస్పీ రెండో పటాలం మైదానం (వెంకటరమణ కాలనీ వైపు)లో నూతనంగా నిర్మించిన సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇందుకోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా మిత్రలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏడు సీఐడీ ప్రాంతీయ కార్యాలయాలను
ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఐడీ విభాగానికి రాజమండ్రి, గుంటూరు, విశాఖపట్నంతో పాటు నాల్గో యూనిట్‌ కింద కర్నూలును ఎంపిక చేసి నూతన భవనాన్ని నిర్మించామన్నారు. నెల్లూరు, విజయవాడ, తిరుపతిలో త్వరలో సీఐడీ కార్యాలయాలు నిర్మించనున్నట్లు వివరించారు.