మంచిర్యాల: జిల్లా రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపని బీజేపీ బలోపేతం దిశగా సాగుతోంది. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం, రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్‌ స్థానాలు కైవసం చేసుకోవడంతో అనూహ్యంగా బీజేపీ పుంజుకొంటోంది. తాజాగా పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ కమలం గూటికి చేరడంతో జిల్లాలో ఆయన వర్గంగా ఉన్న నాయకులు, తటస్థులు, ఇతర పార్టీల వాళ్లు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆశావహుల అడుగులు కమలం వైపు పడుతున్నాయి.  మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆశావహులంతా బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారు. పక్కనున్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో
పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలోనూ అదే ఊపు కనిపిస్తోంది. ఇదే
సమయంలో మాజీ ఎంపీ జి.వివేక్‌ బీజేపీలో చేరడం ఆ పార్టీలో మరింత
ఉత్సాహాన్ని నింపింది. వివేక్‌ కుటుంబానికి జిల్లాలో బలమైన వర్గం  ఉండడంతో ఆ వర్గమంతా ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశం ఉంది.