నిరుద్యోగ నిర్మూలనలో భాగమా ?...అవినీతికి పరాకాష్ఠ ?

అనంతపూర్: మామూలుగా ఒక ఇంట్లో ఒకసారి ఒకరికి ఉద్యోగం రావటమే కష్టం. అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్న జగన్ ప్రభుత్వం అనంతపూర్ జిల్లాలో మాత్రం ఒక ఇంట్లో తాము అన్న మాట నిలబెట్టుకుంది. ఒకే ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు రావడం ఆశ్చర్యంగా ఉందా! హిందూపూర్ లో తాజాగా ఎంపికైన వార్డు వలంటీర్లు  నలుగురు  ఒకే కుటుంబ సభ్యులు. నగర పాలక సంస్థలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. ఇలా ఒకే ఇంట్లో నలుగురు, ముగ్గురు, ఇద్దరు కుటుంసభ్యులు ఎంపికయ్యారు. ఇందులో వారి ప్రతిభా పాటవాలున్నాయో?లేక సిఫార్సులు పనిచేశాయో? తెలియదు కాని వారంతా అలా ఎంపికైపోయారంతే. నాలుగురోజుల పాటు జరిగిన శిక్షణా తరగతుల్లో ఈ విషయం బట్టబయలైంది. దాదాపు 50ఇళ్లలో ఇద్దరేసి చొప్పున ఎంపికైనట్లు తెలిసింది. ఎఫ్‌పీ షాపులు ఎక్క డికిపోతాయోననే భయంతో డీలర్లు సైతం తమ సంతానంతో వాలంటీర్ల కోసం దరఖాస్తు చేయించారు. వివిధ విభాగాల్లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూనే, ఇక్కడ ఎంపికై శిక్షణకు హాజరైన వారు లేకపోలేదు. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను తీసుకొ చ్చింది. దీంతో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశం నీరుకారుతోంది.  ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి అవకాశం ఇస్తే ఉపాధి, ఉద్యోగం లేని కుటుంబాల్లోని నిరుద్యోగులు ఏమవ్వాలి?