మేం ముందునుంచి చెబుతూనే  ఉన్నాం. లోకేషన్ ను ఇంత త్వరగా రాజకీయాల్లోకి తీసుకు రావద్దు. కొన్నాళ్లపాటు క్షేత్రస్థాయిలో పని చేస్తే అనుభవం వస్తుంది అని. మీరు మా మాట వినకుండా పుత్రోత్సాహంతో ఆయనను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. పైగా మంత్రిని చేశారు. ఈ పుత్రోత్సాహము ఇప్పుడు పుట్టి ముంచుతోంది”…. ఇవి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల మాటలు.

"ఈ నాయకులు 25 కేజీల బియ్యం, 3వేల రూపాయల ప్యాకెట్ మనీ ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 10 లక్షలు చొప్పున 5 ఏళ్లకు 50 లక్షల బీమా చేయిస్తానని మాటిస్తున్నాను." 


కడపలోని అన్నమయ్య సర్కిర్ లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రకటించిన సరికొత్త హామీ ఇది. ఈ హామీ విని ప్రజలు ముక్కన వేలేసుకున్నారు. మరికొందరు మాత్రం పవన్ ఏం చెప్పారో అర్థంకాక చప్పట్లుకొట్టారు. ఇంతకీ పవన్ ఏం చెప్పదలచుకున్నారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను ఆపేసి బీమా ఇస్తారా? లేక పెన్షన్ తో పాటు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తారా? అసలు పెన్షన్ కు బీమాకు ముడిపెట్టి మాట్లాడ్డం ఏంటి పవన్? 

ప్రతి ఒక్కరికి ఏడాదికి 10 లక్షలు చొప్పున ఐదేళ్లకు 50 లక్షలు బీమా చేయిస్తానన్నారు పవన్. ఈ కార్యక్రమాన్ని జనసైనికులకు చేయబోయే బీమాతోనే స్టార్ట్ చేస్తానని కూడా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు బీమా చాలా అవసరం. కానీ అదే పేద కుటుంబం జీవితాన్ని నెట్టుకురావాలంటే పింఛను అత్యవసరం. 

పిల్లికి బిచ్చమేస్తున్నట్టు పించను ఇస్తున్నారని ఆరోపించిన పవన్.. ఆ పెన్షన్ మొత్తాన్ని ఇంకాస్త పెంచుతానని చెబితే బాగుండేది. దాన్ని వదిలేసి బీమా గురించి మాట్లాడారు. అసలు ఎంతమందికి బీమా అవసరం? ఓ నిరుపేద కుటుంబానికి ఇప్పటికిప్పుడు పింఛను అవసరమా? బీమా అవసరమా అనే విషయాన్ని పవన్ ఆలోచించినట్టు లేదు. 

నిజానికి ఈ రెండూ అవసరమే. కానీ పవన్ మాత్రం పెన్షన్ గురించి వదిలేసి బీమా గురించి మాత్రమే మాట్లాడి ప్రజల్ని అయోమయంలోకి నెట్టేశారు.