అమరావతి: చదరపు గజం రూ.20వేలు.. రూ.30వేలు.. రూ.40వేలు.. అంటూ రాజధానిలో ఉరుకులు పరుగులు తీసిన రియల్‌ ఎస్టేట్‌ రంగం నేడు కుదేలైంది. అమరావతిలో స్థలాల ధరలు అంతకంతకూ తీసికట్టు అనే చందంగా ఉండడంతో వాటి యజమానులు అగమ్యగోచరస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే ప్లాట్ల ధరలు సుమారు 40శాతం వరకూ క్షీణించాయి. ఏ అవసరమొచ్చినా ఒక ప్లాట్‌ను, అదీ తాము చెప్పిన రేటుకే అమ్ముకుని, కావలసిన నగదును ఒకట్రెండు రోజుల్లోనే పొందగలమని గతంలో ధీమాతో ఉన్న పలువురు భూ యజమానులు, ఇప్పుడు తక్కువ రేట్లకే అమ్ముతామన్నా కొనేవారు కానరాక బిక్కముఖాలేస్తున్నారు. 

అమరావతి నిర్మాణానికి ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాతిపదికన భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం ఇస్తున్న వార్షిక కౌలు చెల్లింపు కూడా నిర్ణీత గడువు దాటి 2 నెలలైనా వారి బ్యాంక్‌ఖాతాల్లో జమ కాలేదు. దీంతో, రోజువారీఅవసరాలు, పిల్లల చదువులు, శుభకార్యాలకు సొమ్ము చేతిలో లేక కటకటలాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో లభించిన అగ్ర ప్రాధాన్యంతో అమరావతిలోని పలు ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయలతో చకచకా సాగిన సంగతి తెలిసిందే. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతో సహా పలు ప్రధాన రహదారులు, ఐకానిక్‌ నిర్మాణాలైన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లు, హౌసింగ్‌ టవర్లతో కూడిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, రాజధానిని ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమ ప్రదేశంతో అనుసంధానించే ఐకానిక్‌ బ్రిడ్జ్‌, అమరావతి సెంట్రల్‌ పార్క్‌, ఎస్‌ఆర్‌ఎం-విట్‌ తదితర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, టూరిజం ప్రాజెక్టు పనులు పరుగులు తీయడంతో రాజధానిలోని 29 గ్రామాల్లోనూ ప్లాట్ల ధరలు అంతకంతకూ పెరుగుతూ పోయాయి.
 
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, కృష్ణానది, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లకు దగ్గర్లోని గ్రామాల్లో చదరపు గజం ధర రూ.34వేల నుంచి రూ.40వేలు వరకూ పలికింది! వైసీపీ అధికారంలోకి రావడం, దాని ప్రాధాన్య జాబితాలో అమరావతి లేకపోవడంతో రాజధాని ప్రాభవం క్రమేణా తగ్గుతోంది. రాజధానికి ప్రభుత్వం తగినన్ని నిధులను మంజూరు చేయకపోవడం, ప్రపంచ బ్యాంక్‌, ఏఐఐబీ వంటి అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు రుణాలిచ్చే ప్రతిపాదనలను విరమించుకోవడం వంటి పరిణామాలతో అమరావతికి ఇప్పట్లో మంచి రోజులు వచ్చేలా లేవన్న అభిప్రాయం పలువురిలో బలపడింది. ఈ నేపథ్యంలో ప్లాట్ల ధరలు అంతకంతకూ పడిపోతున్నాయి. అయితే, ప్లాట్ల ధరలు గణనీయంగా తగ్గిపోయినా కొనుగోలుదారులు కొద్దిమంది మాత్రమే ముందుకు వస్తున్నారు. ఫలితంగా అడపాదడపా మాత్రమే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. కాగా, అమరావతి నిర్మాణం చురుగ్గా ఉన్న సమయంలో రాజధానిలోని ప్రతి గ్రామంలోనూ కనీసం 40-50 మంది మధ్యవర్తుల అవతారం ఎత్తారు. దాదాపు అందరూ ప్లాట్ల క్రయవిక్రయాల ద్వారా లభించే కమీషన్లతో చెప్పుకోదగిన మొత్తాలనే ఆర్జించారు. ప్రస్తుతం ప్లాట్లకు గిరాకీ పడిపోవడంతో వీరు డీలా పడిపోయారు. మరికొందరు తెలంగాణలో రియల్టీ జోరుగా సాగుతున్న ప్రాంతాలకు వెళ్లి, జీవనం సాగించేందుకు సమాయత్తమవుతున్నారు.