బక్రీద్ నాడు కుర్బానీ బంద్... 

 ముజఫ్ఫర్‌పూర్: బీహార్‌లోని ముజఫ్ఫర్‌పూర్‌లో హిందూ- ముస్లింల మధ్య మతసామర్యం వెల్లివిరిసింది. ఈ ప్రాంతానికి చెందిన పలు ముస్లిం కుటుంబాలు దేశంలోని ముస్లింలకు ఒక సందేశాన్నిస్తున్నాయి. బక్రీద్‌ సందర్భంగా వీరు కుర్బానీ(బలిదానం) చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా గొర్రెలను బలి ఇవ్వవద్దని వారు ముస్లిం సోదరులకు పిలుపునిస్తున్నారు. కాగా ముజఫ్ఫర్‌పూర్ ముస్లింలు తీసుకున్న నిర్ణయం బీహార్ అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్బంగా ఈ ప్రాంతానికి చెందిన ముస్లిం సోదరుడు హేంజన్ ‌కారీ మాట్లాడుతూ ఈ ముస్లిం కుటుంబాలన్నీ ముజఫ్ఫర్‌పూర్‌లోని గరీబ్‌నాథ్ మందిరం సమీపంలో ఉంటాయని తెలిపారు. తాముంతా శ్రావణ సోమవారంనాడు కుర్బానీ చేయకూడదని నిర్ణయించుకున్నామన్నారు. బజార్ మసీదు కమిటీ ప్రతినిధి మొహమ్మద్ ఆజాద్ మాట్లాడుతూ తాము కుర్బానీ చేయడం వలన కావడియాత్రలో ఉన్న శివభక్తులు ఇబ్బంది పడతారని, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకే మంగళవారం కుర్బానీ చేయాలనుకుంటున్నామని, ఆరోజున గరీబ్‌నాథ్ మందిరంలో కావడి యాత్రికుల తాకిడి తక్కువగా ఉంటుందని అన్నారు. కాగా గత ఏడాది ముజఫ్ఫర్‌పూర్‌లో బక్రీద్ సందర్భంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలీసులు నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.