అమరావతి: శాసనమండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ సీట్లకు త్వరలో జరిగే ఉప ఎన్నికలకు వైస్సార్‌సీపీ అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌, కర్నూలు జిల్లా సీనియర్‌ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఈమేరకు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 14వ
తేదీతో ఎన్నికల నామినేషన్‌కు గడువు ముగియనుండడంతో వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. చల్లా ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.  మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలూ ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే.  ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే మూడు స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే చేరనున్నాయి.