హైదరాబాద్: ముస్లింల ప్రముఖ పండుగల్లో బక్రీద్‌ ఒకటి. ధనిక, పేద
తారతమ్యం లేకుండా ప్రతి ముస్లిం బక్రీద్‌ను జరుపుకుంటారు. పవిత్ర త్యాగానికి ప్రతిరూపమైన దైవ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం, అల్లా ప్రసన్నం కోసం చేసిన మహోన్నత త్యాగాన్ని బక్రీద్‌ సందర్భంగా ముస్లింలు స్మరించుకుంటారు. ఇస్లాం మతంలో రంజాన్‌ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న పండుగ ఈ ఈదుల్‌ జుహా (బక్రీద్‌). దీనినే త్యాగాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈదుల్‌ ఫితర్‌ జరిగిన రెండు నెలలకు ఇస్లాం కేలండర్‌ ప్రకారం 12వ నెల (జుల్‌ హజ్జా) 10వ రోజున బక్రీద్‌ను జరుపుకుంటారు. సోమవారం దేశవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకోనున్నారు. బక్రీద్‌ నిర్వచనం  సమాజంలో పేరుకుపోతున్న
రుగ్మతల నుంచి జనావళిని జాగృత పరుస్తూ సన్మార్గంలో  నడిపించేందుకు అ ల్లాహ్‌ భూమండలానికి 80 వేల మంది ప్రవక్తల్ని పంపినట్టు ముస్లింల ఆరాధ్య గ్రంధం దివ్యఖురాన్‌ చెబుతోంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం. ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడ గ్రహించేందుకు అల్లా పలు పరీక్షలు పెట్టేవారు. ఈ క్రమంలో హజ్రత్‌ ఇబ్రహీం అనే ప్రవక్త నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లా కనిపించి నీ కుమారుడిని తనకు బలి ఇవ్వమని ఆదేశిస్తాడు.
ఇబ్రహీం తనకు వచ్చిన కల గురించి ఒక్కగానొక్క కుమారుడైన ఇస్మాయిల్‌కు తెలియజేస్తా డు. దైవ భక్తుడైన ఇస్మాయిల్‌ అందుకు అంగీకరించి బలికి సిద్ధవమవుతాడు.  కుమారుడిని బలి ఇస్తున్న సమయంలో అల్లా అతని త్యాగనిరతిని మెచ్చుకుని, బలి ఇవ్వడానికి ఆకాశవాణి ద్వారా ఒక గొర్రెను సృష్టించి ఇస్తాడు. గొర్రెను (బక్రా ) అంటారు. ఆనాటి నుంచి ఈ పండుగకు బక్రీద్‌ అని పిలుస్తారు.
ఖుర్బానీ  బక్రీద్‌ సందర్భంగా ముస్లింలు ఖుర్బానీ
ఇవ్వడం అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ఒక గొర్రె పొట్టేలు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పేదలకు పంచి పెడతారు. మిగిలిన భాగాల్లో  రెండో దానిని బంధువులకు, మూడో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. దీనినే ఖుర్బానీ అంటారు.