అమరావతి: ప్రస్తుత పరిస్థితులలో సి.సి.కెమెరాల పాత్ర అత్యావశ్యకమైంది.సీసీ కెమెరాల పుటేజ్‌ పోలీసులకు కీలకంగా మారింది. దీంతో అన్నిప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలు,  జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్, జన సంచారం ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లతో అనుసంధానించారు. రాష్ట్ర పోలీస్‌ శాఖ పరిధిలో 8,148 సీసీ కెమెరాలను నిర్వహిస్తున్నారు. దీనికితోడు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆరీ్టజీఎస్‌) ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామ
స్థాయిలోనూ అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 5,200 సీసీ కెమెరాలు ఉండగా మరో 14,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ఈ ఏడాది జూలైలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితోపాటు ప్రతీ ఇంటింటికి నిఘా నేత్రాన్ని విస్తరించేలా రాష్ట్ర పోలీసులు కొత్త ప్రతిపాదనలు చేశారు. తొలుత వీధుల్లో ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని ఇళ్లను కవర్‌ చేసేలా చూస్తారు. అటు తరువాత ప్రజలను చైతన్యం చేసి ప్రతీ ఇంటిలో వారే సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా దశలవారీ కార్యచరణ చేపట్టనున్నారు.