నెహ్రూ కాలిగోటికి కూడా బి‌జే‌పి నేతలు సరిపోరు...

దిల్లీ: కాశ్మీరును కాపాడుకోవడంపై ప్రధానంగా దృష్టిసారించాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కశ్మీర్ వ్యవహారంపై అత్యంత జాగరూకతతో, ఆలోచనతో వ్యవహరించాలని ప్రధాని మోది, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. అలా కాని పక్షంలో కశ్మీర్ మన చేతులు జారిపోతుందని హెచ్చరించారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్‌పై వస్తున్న అంతర్జాతీయ కథనాలను ప్రస్తావించారు. 'అంతర్జాతీయ మీడియా వార్తలను, కశ్మీర్‌లో ఏమి జరుగుతోందో ఓసారి చూడండి. 370 ఆర్టికల్‌ని రద్దు చేయడం ద్వారా వారు (ప్రభుత్వం) నిప్పుతో చేతులు కాల్చుకున్నారు. కశ్మీర్‌ను కాపాడుకోవడంపై మోదీ, అమిత్‌షా, దోవల్‌ ప్రధానంగా దృష్టిపెట్టాలి. కశ్మీర్ అంశంపై జాగ్రత్తగా ఆలోచించి, సమగ్ర కసరత్తుతో ముందడుగు వేయాలి. లేదంటే కశ్మీర్ మన చేజారిపోతుంది' అని అన్నారు. 370 అధికరణను తేవడం, పాకిస్థాన్‌తో కాల్పుల విరమణను ప్రకటించడం ద్వారా నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేరానికి పాల్పడ్డారంటూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్ మండిపడ్డారు. నెహ్రూ పాదధూళికి కూడా ఆయన సరిపోరని, ఆయన సిగ్గుపడాలని దిగ్విజయ సింగ్ అన్నారు.