హార్ట్‌ఫోర్డ్‌ (అమెరికా), కనెక్టికట్‌లో జన్మించిన జాన్‌వుడ్‌ ప్రసిద్ధ రచయిత. తొలుత గ్రేటర్‌ చైనాలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ డైరెక్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ డెవల్‌పమెంట్‌గా పనిచేశారు. అక్కడ పనిచేసే రోజుల్లోనే ఆయన ఓ సారి స్నేహితులతో కలిసి నేపాల్‌ సందర్శించారు. వారికి ఓ ప్రభుత్వ పాఠశాల పిల్లలు బయట ఆడుకుంటూ కనిపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలవడంతో అసలు విషయం తెలిసింది వారికి. పాఠ్య పుస్తకాల కొరతతోనే పిల్లలు బయట ఆడుకుంటున్నారని తెలిసి జాన్‌వుడ్‌ ఆందోళనకు గురయ్యారు. పిల్లల్లో పలు అంశాలపై పఠనాసక్తి/చదువు పట్ల అభిరుచిని పెంచాల్సిన అవసరం ఉందని జాన్‌వుడ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని 16 దేశాల్లో 16.6 మిలియన్ల పిల్లలకు మాతృభాషల్లో పఠనాభిరుచిని పెంచేందుకు జాన్‌వుడ్‌ స్వచ్ఛంద సంస్థ రూమ్‌ టు రీడ్‌ ఎంతగానో దోహదం చేసింది. మన దేశంలోనూ వివిధ రాష్ట్రాల  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో రూమ్‌ టు రీడ్‌ - పఠనాలయాలు విస్తరించాయి. ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకుని ఆయా పాఠశాలల భవనంలో ఓ తరగతి గదిని చక్కగా పఠనాలయంగా తయారు చేయిస్తున్నారు.