తుంగభద్ర: సెల్ఫీ మోజు ప్రాణాలను తీస్తుందని మాత్రమే ఇప్పటి వరకు విన్నారు. చూశారు. కానీ అదే సెల్ఫీ  ఓ వృద్ధుడిని కాపాడింది. ఆత్మహత్యకు పాల్పడుతున్న వృద్ధుడిని గుర్తించిన సదరు సెల్ఫీ ప్రేమికుడు.. వెంటనే అక్కడున్న వారిని అలర్ట్ చేసి.. ఆయన్ను రక్షించాడు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో ఉన్న హరిహర తాలూకాలో జరిగింది. వర్షాల కారణంగా స్థానిక జలాశయాలు నిండుగా కళకళలాడుతున్నాయి. పరవళ్లు తొక్కుతున్న వరదనీటి ప్రవాహంతో.. చూడటానికి ఎంతో మనోహరంగా ఉన్నాయి. తాలూకాలోని తుంగభద్రా నది బ్రిడ్జిపై అలాంటి దృశ్యాన్నే చూశాడో యువకుడు. వెంటనే తన మోటర్ సైకిల్‌ను పక్కన ఆపి.. సెల్ఫీకి రెడీ అయ్యాడు. ఫొటోలో బ్రిడ్జీకి అవతలి వైపున ఓ వ్యక్తి కనిపించాడు. అనుమానంగా అటువైపు తిరిగి చూస్తే.. దూకేందుకు సిద్ధమవుతున్నాడు. వెంటనే గట్టిగా కేకలు పెట్టి అక్కడున్న వారిని  అలర్ట్ చేశాడు. అందరూ కలిసి ఆయనను రక్షించారు. ఆ తర్వాత అతన్ని ఆయన ఇంటికి క్షేమంగా చేర్చారు.