భగవద్గీతను శ్రీకృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తరువాత తాంబూలం సేవిస్తూ "అర్జునా! కులాసాగా మనం భగవద్గీత చెప్పుకుందామా!!", అని చెప్పలేదు లేక సాయంత్రం విహారానికి వెళ్ళినప్పుడు, తీరిక సమయంలో చెప్పలేదు. ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజుకు చెప్పలేదు, పితామహుడు భీష్మునికి చెప్పలేదు, నీతి కోవిదులకు కూడా చెప్పలేదు ఆయన కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అది కూడా యుద్ధం ఇంకాసేపట్లో జరగబోతుంది అనగా చెప్పాడు అర్జునుడి మనసు సంఘర్షణలతో క్షుబితం అయినప్పుడు చెప్పాడు. అర్జునుడు
తాను యుద్ధం చేయను అనే నిర్వేదం ఆవహించినప్పుడు చెప్పాడు. "నాకు ఏమీ తోచడం లేదు ఏ నిర్ణయం తీసుకునే శక్తి నాకు లేదు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు కృష్ణ!!" అని అర్జునుడు పూర్తిగా శరణాగతి అయిన తరువాత చెప్పాడు. #నానుశోచంతి అనే పదం తో మొదలుపెట్టి #మాశుచః అనే పదంతో పూర్తి చేస్తాడు అంటే బాధపడుతున్న అర్జునుడి  కన్నీళ్లు తుడిచాడు. 

 

మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణ భారత
యుద్ధం. మంచి  పాండవులు అయితే, చెడు కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపేది భగవద్గీత. కేవలము భగవంతుని మీద భక్తి ఉంటే చాలదు సాటి మానవుల మీద సాటి ప్రాణుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండాలని బోధిస్తోంది గీత. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు సాటి మానవులను దూషిస్తే సాటి, ప్రాణుల్ని హింసిస్తే అది పరమాత్మను హింసించినట్టు అవుతుంది అని నొక్కి చెప్పింది గీత.భగవద్గీత అంటే గ్రంథం మాత్రమే కాదు భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గాలు ప్రాప్తిస్తాయని, సరాసరి మోక్షం వస్తుందని చదవకూడదు.  భగవద్గీత మోక్షానికి మార్గం చూపుతుంది ఆ మార్గంలో నడవాల్సిందే మనమే అందుకని విద్యార్థి దశ నుండి భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి, కాలేజీలలో డిబేట్లు పెట్టాలి, గీతను ఒక పరిశోధన అంశంగా పరిగణించాలి, ప్రతి విద్యార్థికి ఒక పాఠ్యాంశంగా చేర్చి బోదించ తగ్గది. భగవద్గీత ప్రతి వారిలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగించి  వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. కానీ నేడు జరుగుతున్నది ఏమిటి భగవద్గీతను ఘంటసాల గానామృతం చేస్తే దానిని శవాల దగ్గర అ స్మశానాలలో వినిపిస్తున్నారు.  భగవద్గీత వినపడితే చాలు ఎవరో పోయినట్టు భావన కలిగిస్తున్నారు  ఈ దౌర్భాగ్య స్థితి నుండి మనం బయట పడాలి.