దొంగల్ని తరిమికొట్టిన వృద్ధ దంపతులు !

తిరునల్వేలి: ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగల్ని వృద్ధ దంపతులు తరిమికొట్టిన ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కడయంలో కత్తులతో దొంగతనానికి వచ్చిన ఇద్దరు ఆగంతకులను వృద్ధ దంపతులు వీరోచితంగా ఎదుర్కొన్నారు. ఓ వృద్ధుడు తన ఇంట్లో కూర్చొని పని చేసుకుంటుండగా.. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చిన ఓ ఆగంతకుడు వృద్ధుడి మెడలో టవల్‌ వేసి స్తంభానికి కట్టే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే వృద్ధుడి భార్య అక్కడికి చేరుకొని ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో వృద్ధుడు తన మెడకు కట్టిన టవల్‌ నుంచి విడిపించుకొని తమ వద్ద ఉన్న కుర్చీలతో ఆగంతకులపై ఎదురుదాడికి దిగారు. ఆగంతకులు కత్తులతో బెదిరించినా ఏమాత్రం భయపడకుండా కుర్చీలతో ప్రతిఘటించి వారిని తరిమి తరిమి కొట్టారు. దీంతో ఆగంతకులు పలాయనం చిత్తగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.