హైదరాబాద్‌: ఇక్కడ గోల్కొండ పరిధిలో సోమవారం ఓ భర్త తన భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణ సంఘటనపై  పోలీసులు తెల్పిన  వివరాల ప్రకారం.. మోతీమహల్‌ ప్రాంతానికి  చెందిన బషీర్‌ అహ్మద్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇదివరకే పెళ్లైంది. తన భార్య చెల్లెలు సమీరా బేగంను  (35)  రెండో వివాహం చేసుకున్నాడు.  సమీరా బేగంపై బషీర్‌ అనుమానం పెంచుకోవడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తాజాగా ఈ గొడవలు పోలీస్‌ స్టేషన్‌ వరకూ చేరడంతో కొద్దిరోజుల కిందట ఇద్దరికీ కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు పోలీసులకు బషీర్‌ ఫోన్‌చేసి భార్యను హత్య చేసినట్లు తెలిపి పరారయ్యాడు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సైలు సతీష్‌రెడ్డి, శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గొంతుకోసి ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో ఆయుధం దొరకలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.