సాటి మనిషికి సాయం చేయటానికి కావలసింది డబ్బు, పేరు కాదని, సాయపడే మనసుండాలని నిజమైన హీరో సంపూ మరొకసారి రుజువు చేశాడు.  గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర కర్ణాటకలో భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరదల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోపోయారు. లక్షలమంది నిరాశ్రయులై తలమీద నీడ లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. సహాయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు తెలుగు హీరో సంపూర్ణేష్ బాబు టాలీవుడ్ పరిశ్రమ నుంచి వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుగా ముందుకొచ్చాడు.

ఉత్తర కర్ణాటకలో వరదలు తనను కలిచివేశాయని, కన్నడ ప్రజలు తెలుగు సినిమాను దశాబ్దాలుగా ఆదరిస్తున్నారని సంపూ ట్వీట్ చేశాడు. తనను కూడా హృదయ కాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారని, వరదల తాలూకు ఫొటోలు చూసి చాలా ఆవేదన కలిగిందని,  తన వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నానని సంపూర్ణేష్ బాబు ట్వీట్ లో తెలిపాడు.