హైదరాబాద్‌: అందమైన అమ్మాయిల ఫొటోలను సామాజిక మాధ్యమాల నుంచి సేకరించి, మార్ఫింగ్‌ చేసి అశ్లీల వెబ్‌సైట్లలో పెడతాడు. వారిని ఫోన్‌ లేదా మెసెంజర్ల ద్వారా సంప్రదిస్తాడు. ‘మీ ఫొటోలు ఫలానా పోర్న్‌ సైట్‌లో ఉన్నాయి. వాటిని ఎలా తీయించాలో నాకు తెలుసు. కాకపోతే కాస్త ఖర్చవుతుంది’ అంటూ మంచివాడిలా నటిస్తాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో అతడు సీసీఎస్‌ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఏపీలోని విశాఖపట్నం హెచ్‌.సత్యనగర్‌కు చెందిన పాడి వినోద్‌కుమార్‌(25) అలియాస్‌ సందీప్‌ అలియాస్‌ ప్రవీణ్‌.. ఈ పద్ధతిలో 300 మంది మహిళల నుంచి డబ్బులు దండుకున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి ఫొటోలు పోర్న్‌సైట్లలో పెట్టాడు. ఆరు నెలల క్రితం ఆమెకు కాల్‌ చేసి తనదైన పద్ధతిలో వ్యవహారం నడిపాడు. మాటలు నమ్మిన ఆ యువతి.. రూ.10 వేల చొప్పున నాలుగు నెలలపాటు అతడికి ఇచ్చింది. సొమ్ములిచ్చినంతకాలం పోర్న్‌సైట్లలో ఫొటోలు మాయమయ్యాయి. మేలో డబ్బులు ఇవ్వకపోవడంతో ఫొటోలతోపాటు ఫోన్‌ నంబర్‌ కూడా పెట్టాడు. ఆ నంబర్‌కు పలువురు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతుండడంతో ఆమె సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. వారి దర్యాప్తులో వినోద్‌ గుట్టు రట్టయింది.