ట్విట్టర్ అక్కౌంటు తొలగింపు...
 

చండీఘర్‌:  ప్రముఖ పంజాబీ పాప్‌ సింగర్‌ హర్ద్‌ కౌర్‌ తన దూకుడుతో మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ఆమెపై దేశద్రోహంతో పాటు పలు కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆమె తన పద్ధతి మార్చుకోనట్లుగా అనిపిస్తోంది. ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలపై పాట రూపంలో హర్ద్‌ కౌర్‌ విరుచుకుపడింది. పంజాబ్‌ నుంచి విడిపోయి ప్రత్యేక దేశం ఖలిస్తాన్‌ కావాలని కోరుకుంటున్న సిక్కులకు మద్దతుగా ఈ పాట సాగుతుంది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో ఖలిస్తాన్‌ మద్దతుదారులతో కలిసి మోదీ, అమిత్‌ షాలకు ఘాటుగా సవాలు విసిరింది. అంతటితో ఆగక వారిద్దరిపై అభ్యంతరకర పదజాలాన్ని ప్రయోగించింది. ఈ వీడియోను కౌర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ట్విటర్‌ హార్ద్‌ కౌర్‌ అకౌంట్‌ను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.