ఆగస్ట్ 15న శ్రీనగర్ లాల్ చౌకులో అమిత్ షా జెండా వందనం...!

శ్రీనగర్ : భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవాలను జమ్మూ-కశ్మీరులో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాహసోపేతమైన చర్యలతో జమ్మూ-కశ్మీరును భారత దేశంలో పరిపూర్ణంగా అంతర్భాగం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
 జమ్మూ-కశ్మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్లానింగ్ కమిషన్) రోహిత్ కన్సల్ మంగళవారం మాట్లాడుతూ జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవాలను నిర్వహించేందుకు డ్రెస్ రిహార్సల్స్ జరుగుతున్నాయన్నారు. ఈద్ పండుగ ప్రశాంతంగా ముగియడంతో నిషేధాజ్ఞలను సోమవారం మరింతగా సడలించినట్లు తెలిపారు. జమ్మూ ప్రాంతంలో దాదాపు ఆంక్షలు లేవన్నారు. కశ్మీరులో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆంక్షలు ఉన్నట్లు తెలిపారు.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అమిత్ షా ఆగస్ట్ 15న శ్రీనగర్ లాల్ చౌకులో జాతీయ జెండా ఎగురవేయ బోతున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత 16,17వ తేదీలలో లడాక్ పర్యటిస్తారని తెలిసింది.