ఔను మనం  ఏకాకులమే...

దిల్లీ: కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ పరోక్షంగా అంగీకరించారు. అలాగే అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పాక్‌ ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ అంశంలో భారత్‌పై పాక్‌ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐరాస భద్రతా మండలి సిద్ధంగా లేదని ఘాటుగా స్పష్టం చేశారు. ‘‘ కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకొని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా సులభం. ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం. వారు(ఐరాస) మనల్ని పూలమాలతో స్వాగతం పలకడానికి సిద్ధంగా లేరు. శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా మనకు అడ్డంపడవచ్చు. ప్రజలు వివేకంతో ఆలోచించాలి’’ అని ఆదివారం అక్కడి ఓ ప్రముఖ ఛానెల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై భారత్ నిర్ణయానికి రష్యా  మద్దతు ప్రకటించిన తరువాతే ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. అన్ని దేశాలను, ప్రపంచ దేశాల కూటములను, సంస్థలను మద్దతు కోసం  రకరకాలుగా ప్రయత్నించి, విఫలం కావటంతో దిక్కుతోచని స్థితిలో తత్వం బోధపడి ఇన్ని సంవత్సరాలకు ఒక్క నిజం మాట్లాడింది.