అల్లాటిపల్లి పవన్‌కుమార్‌రెడ్డిది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు. తండ్రి నారాయణరెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. తల్లి వెంటకరత్నమ్మ గృహిణి. ఐదవ తరగతి వరకు నేరేడుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆ తర్వాత 10 వరకు ఒంగోలులోని నవోదయ పాఠశాలలో, ఇంటర్‌ రత్నం కళాశాలలో పూర్తి చేశారు. బాపట్ల వ్యవసాయ కళాళాలలో అగ్రికల్చర్‌ బీఎస్సీ జాయిన్‌ అయ్యారు. బీఎస్సీ పూర్తి కాగానే ఉత్తరాఖాండ్‌లోని జీపీ పంత్‌ కళాశాలలో అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత దొనకొండ ఏఈఓగా 2011 లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌ సన్నాహాలు ప్రారంభించారు పవన్‌. 2012లో సివిల్స్‌ రాయడం మొదలుపెట్టి 2015 వరకు సివిల్స్‌పై సమరం సాగించారు. 2012లో ప్రిలిమినరీ, 2014, 2015లో మెయిన్స్‌ వరకు వచ్చి ఓడిపోయినా నిరాశ చెందలేదు. జీవితంలో ఓడిపోయానని అనిపించిన ప్రతిసారి స్టేజీపై రమేష్‌ రెడ్డి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి. 2016లో ఢిల్లీ నుండి హైదరాబాదుకు తిరిగి వచ్చి స్నేహితులతో కలసి మళ్లీ ప్రిపరేషన్‌ మొదలుపెట్టారు. గతంలో ఏర్పడిన వైపల్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నారు. నాలుగవ ప్రయత్నంలో మెయిన్స్‌ను పూర్తి చేసి ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఇంటర్వ్యూను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.