నోయిడా: జిమ్ ట్రైనరుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత...భర్తను హతమార్చేందుకు ప్రియుడికే సుపారి ఇచ్చిన ఘటన గ్రేటర్ నోయిడా నగరం సమీపంలోని సాఖీపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. గ్రేటర్ నోయిడాకు చెందిన రాజీవ్ వర్మ ఒయాసిస్ వినేషియా హైట్స్ కంపెనీలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. వర్మ భార్య షిఖా జిమ్‌కు వెళుతూ,  అక్కడ జిమ్ ట్రైనరు రోహిత్ కశ్యప్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన భర్త వర్మను హతమార్చాలని చెప్పి షిఖా తన ప్రియుడైన రోహిత్ కశ్యప్ కు రూ.1.2 లక్షలను సుపారీగా ఇచ్చింది. ప్రియుడైన రోహిత్ కశ్యప్, రోహన్ కుమార్ అనే ఓ కిల్లరుతో వర్మ హత్యకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. మోటారుసైకిలుపై వచ్చిన రోహిత్, రోహన్ కుమార్ లు వర్మపై కాల్పులు జరిపి పారిపోయారు. వర్మ శరీరంలో నాలుగు బుల్లెట్లు దూసుకుపోగా వాటిని తొలగించిన వైద్యులు చికిత్స చేయడంతో అతని ప్రాణాపాయం తప్పింది. అనంతరం పోలీసుల దర్యాప్తులో భర్తను హతమార్చేందుకు భార్య షిఖానే సుపారీ ఇచ్చిందని తేలింది. ప్రియుడు రోహిత్ కశ్యప్ ను అరెస్టు చేసి ప్రశ్నించగా, తన ప్రియురాలైన షిఖానే ఆమె భర్త వర్మ హత్యకు సుపారీ ఇచ్చిందని వెల్లడించాడు. దీంతో పోలీసులు షిఖాతోపాటు రోహిత్, కిల్లర్ రోహన్ కుమార్ లను అరెస్టు చేశారు.