ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం.. అంతకు మునుపు జావా సముద్ర జలాల్లో కూలిపోయిన ప్రమాదంతో కలిపి 346 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాల్లో కూలినవి ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాలే. దీంతో పలు దేశాలు ఈ విమానాలపై నిషేధం విధించాయి. తక్షణమే వాటిని విమానయాన సంస్థలు విరమించుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి.

 

ఇప్పుడు అదే బాటను ఇండియా అనుసరించింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు బుధవారం సాయంత్రం 4 నుంచి ఇండియాలోని ఎయిర్‌పోర్టుల నుంచి టేకాఫ్ తీసుకోవడం గానీ, ల్యాండింగ్ కావడం కానీ జరగవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా భారత గగనతలంపై నుంచి ఆ రకం విమానాల రాకపోకలను కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇతర దేశాల విమానాలు కూడా మన గగనతలంపై ఎగిరే అవకాశం లేదు

మన దేశంలో కేవలం స్పైస్ జెట్ వద్ద మాత్రమే ఈ రకం విమానాలు ఉన్నాయి. దీంతో ఆ విమానాలు ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులో ఉండవు. జెట్ ఎయిర్‌వేస్ వద్ద కూడా 5 విమానాలు ఉన్నాయి. కాని చాలా కాలంగా వాటి లీజ్ చెల్లించకపోవడంతో అవి చాన్నాళ్ల నుంచి హ్యంగర్లకే పరిమితం అయ్యాయి.

భారత్‌తో పాటు 13 దేశాలు ఈ రకం విమానాలను నిషేధించాయి. జర్మని, ఆస్ట్రేలియా, మలేషియా, ఒమన్, ఇథియోపియా, సింగపూర్, ఫ్రాన్స్, చైనా, ఐర్లాండ్, ఇండోనేషియా, మొరాకో, బ్రిటన్, మంగోలియా దేశాలు ఈ రకం విమానాలపై నిషేధం విధించాయి. అంతే కాకుండా 27 విమానయాన సంస్థలు ఈ రకం విమానాలను ఉపసంహరించుకున్నాయి.

ఈ విమానాల తయారీలో సాంకేతికంగా చాలా పొరపాట్లు ఉన్నాయి. ల్యాండింగ్ గేర్ తక్కువ సైజులో ఉండటమే కాకుండా… ఫ్యూయల్ ట్యాంకును ఆనుకొనే అతి పెద్ద ఇంజన్లు అమర్చారు. దీంతో విమాన వేగం అకస్మాత్తుగా పడిపోయి కూలిపోతున్నాయి.

అంతే కాకుండా ప్రపంచంలో ఈ రకం విమానాలను నడపడానికి పైలట్లకు సరైన శిక్షణ లేదు. దీనికి సంబంధించిన సిమ్యులేటర్లు అందుబాటులో లేవు. ఆసియాలోని పైలట్లు వీటిపై శిక్షణ పొందాలంటే కేవలం సింగపూర్‌లో మాత్రమే ఒక సిమ్యులేటర్ అందుబాటులో ఉంది.