అమరావతి: 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 13 శాఖల శకటాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా విధినిర్వహణలో సాహసాలు ప్రదర్శించిన పోలీసు అధికారులకు సీఎం మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.