హైదరాబాద్‌: ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతామని మొన్నటి శాననసభ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ హామీ ఇచి్చన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి పెంపుదల వర్తిస్తుందని ఉద్యోగులు ఆశించినప్పటికీ లోక్‌సభ సాధారణ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచడానికి సంబంధించి తగిన సూచనలు, సలహాలతో నివేదిక ఇవ్వాలని సీఎం జూన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సమాచారం. కేంద్రంతోపాటు దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్మెంట్‌ వయసును 58, 60 ఏళ్లుగా రెండు శ్లాబ్‌ల్లో అమలుచేస్తున్నాయి. కొత్తగా 61 సంవత్సరాలకు పెంచడం వల్ల ఏమైనా న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయేమోనన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల బృందం పలుసూచనలు, సలహాలతో నివేదిక సిద్ధం చేసింది. దీనిప్రకారం 33 సంవత్సరాల సర్వీసు కాలాన్ని పూర్తి చేసిన ఉద్యోగులను ఒక కేటగిరిలోకి, అంతకంటే తక్కువ సర్వీసు కలిగిఉన్న ఉద్యోగులను మరో కేటగిరిలోకి తీసుకుని పదవీవిరమణ వయసు పెంపుదల అమలు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి వచ్చే మార్చి నాటికి పదవీ విరమణ చేసే ఉద్యోగుల జాబితా (సీనియారిటీ ఆధారంగా) సిద్ధం చేసింది. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్‌1 నుంచి పెంపుదలను వర్తింపజేయాలని సీఎం భావిస్తున్నారని ఓ ఉన్నతాధికారి చెప్పారు.