హైదరాబాద్‌:  కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపడతామని తెలంగాణా సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణను వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తోందని అన్నారు.ఉత్పత్తుల రంగంలో ముందువరుసలో తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. 73వ స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా  నగరంలోని చారిత్రాత్మక  గోల్కొండ కోటలో గురువారం ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి చర్యలు చేపడతామని చెప్పారు.స్వచ్ఛతే లక్ష్యంగా 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యం వెల్లివెరిస్తున్నాయని తెలిపారు. వాడని బోరుబావులు ఎక్కడ ఉన్నా మూసివేయాలని కోరారు. ఐదేళ్లుగా సుస్థిర ఆర్ధికాభివృద్ధిని సాధిస్తున్నామని చెప్పారు.