ముంబై: బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఊరటనిచ్చింది.  ప్రతినెలా బ్యాంకులు వినియోగదారులకు అందించే ఉచిత ఏటీఎం కోటాలో విఫలమైన లావాదేవీలను లెక్కించవద్దని ఆర్‌బీఐ బుధవారం బ్యాంకులను ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల లావాదేవీలు విఫలం కావడం, నగదు లేక డబ్బు రాకపోవడం వంటి లావాదేవీలను కూడా బ్యాంకులు లెక్కలోకి తీసుకుంటున్నాయనే ఫిర్యాదులతో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ సమస్యలు, ఏటీఎంలో కరెన్సీ అందుబాటులో లేకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల విఫలమయ్యే లావాదేవీలను చెల్లుబాటు అయ్యే లావాదేవీలుగా పరిగణించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లనుంచి ఇందుకోసం ఎలాంటి ఛార్జీ  వసూలు చేయరాదని ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లతో సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు కూడా  ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.