చెన్నై:  నటుడు విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం బిగిల్‌. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ బాణీలను కడుతున్నారు. విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాత వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా విజయ్‌కు, ప్రతి చిత్రానికి తనతో పని చేసిన యూనిట్‌ వర్గాలకు కానుకలు అందించడం ఆనవాయితీ. అదే విధంగా బిగిల్‌ చిత్ర యూనిట్‌కు ఉంగరాలను కానుకగా అందించారు. విశేషం ఏమిటంటే ఆ ఉంగరాలపై బిగిల్‌ అనే పేరును ముద్రించి 400 వందలకు పైగా యూనిట్‌ వర్గాలకు బుధవారం పంచి పెట్టారు. ఆ రోజుతో విజయ్‌కు సంబంధించిన సన్నివేశాలు పూర్తి కావడంతో చివరి రోజున బిగిల్‌ టైటిల్‌తో కూడిన ఉంగరాలను కానుకగా అందించి చిత్ర యూనిట్‌ను ఖుషీ చేశారు.