వాషింగ్టన్‌: ‘మనిద్దరం .. అమెరికాలో తిరుగుతూ.. చర్చిలు, విమానాశ్రయాల్లో హింసకు పాల్పడదాం’ అంటూ ఓ వ్యక్తి తన స్నేహితురాలికి ఏకంగా 10 వేల సందేశాలు పంపించాడు. వివరాలు.. ఫ్లోరిడాకు చెదిన నికోలస్ సి. నెల్సన్ అనే వ్యక్తికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 5 నుంచి నెల్సన్‌ సదరు మహిళకు బెదిరింపు, అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించాడు. 12 రోజుల వ్యవధిలో దాదాపు 10 వేల మెసేజ్‌లు చేశాడు. వాటిలో కొన్ని అసభ్యకరంగా ఉండగా.. మరి కొన్ని ‘మనం కలిసి చనిపోదాం.. అమెరికాలో తిరుగుతూ.. చర్చిలను పేల్చేద్దాం.. విమాన్రాశ్రయంలో దూరి కాల్పులకు పాల్పడదాం’ అనే హింసాత్మక సందేశాలు కూడా ఉన్నాయి.అంతేకాక నెల్సన్‌ సదరు మహిళకు ఓ విమానాశ్రయం ఫోటో పంపి.. తన మాట నిలబెట్టుకోబోతున్నాను అని పేర్కొన్నాడు. నెల్సన్‌ ప్రవర్తనతో విసిగిపోయిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో వారు అతడిని అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విషయం గురించి సదరు మహిళ మాట్లాడుతూ.. స్నేహితుల ద్వారా నికోల్సన్‌తో పరిచయం ఏర్పడిందని.. ఇప్పటి వరకూ రెండు మూడు సార్లు మాత్రమే తాను అతడిని చూశానని తెలిపింది. అంతేకాక నెల్సన్‌ తనకు చేసిన మెసేజ్‌లలో చనిపోతానని పేర్కొనలేదు.. కానీ జైలుకు వెళ్తానని చెప్పేవాడు అని పేర్కొంది.