శ్రీవిల్లిపుత్తూరు దివ్యక్షేత్రంలో వెలసిన స్వామిని వటపత్రశాయి అంటారు. అమ్మవారు రంగమన్నర్ ఆండాళ్. ముక్కళ తీర్థ సమీపంలో, సంశయ విమానంలో, తూర్పుముఖంగా స్వామి కొలువై ఉన్నాడు.  మండూకమహర్షికి స్వామివారి ప్రత్యక్ష దర్శనం లభించింది.  పెరియాళ్వార్,  ఆండాల్,  ఈ స్వామిని కీర్తించారు. శ్రీరంగక్షేత్రంతో పాటుగా అరియర్ సేవలుగల దివ్య క్షేత్రం ఈ శ్రీవల్లిపుత్తూరు.  
శ్రీవైష్ణవ సంప్రదాయానికే కాక భక్తి సంప్రదాయానికే ప్రధాన క్షేత్రం ఈ దివ్య క్షేత్రం. స్వామి కోరికమీద తాను ధరించిన పూమాలను స్వామికి అర్పించి, సేవించి, వరించి మనలను తరింపచేయడానికి గోదాదేవి అవతరించిన పరమ పుణ్యక్షేత్రం ఈ శ్రీవిల్లిపుత్తూరు.

ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మల్లి అనే రాణి పాలించేది అందువల్లనే ఈ ప్రాంతానికి మల్లినాడు అనే పేరు వచ్చింది.  ఇప్పటికీ ఈ దివ్యక్షేత్రానికి దగ్గరగా మల్లి అనే పట్టణం ఉంది.  ఈ రాణికి ఇద్దరు కుమారులు పెద్దవాడు విల్లి,  రెండవవాడు కాంతన్. వీరిద్దరూ ఒకరోజు వేటాడడానికి అరణ్యానికి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద పులిని వెంబడించిన  కాంతన్ దాని చేతిలో మరణించాడు.  ఎంతసేపటికీ రాని తమ్ముడిని వెతుకుతూ, తిరిగి తిరిగి  అలసిన విల్లి ఒక మర్రిచెట్టు కింద వెళ్ళి విశ్రమించాడు. అప్పుడు అతనికి స్వామి కలలో ప్రత్యక్షమై, తమ్ముడు పులివాత పడ్డాడని వివరించాడు. అంతేకాక తాను అక్కడే ఉన్న మర్రిచెట్టు కింద పుట్టల వెలిసానని,  పాండ్యరాజు సాయంతో తనకి ఆలయం నిర్మించమని ఆదేశించాడు.  అతడు పుట్ట తవ్వి చూదగా  నిజంగానే వటపత్రసాయి దర్శన భాగ్యం లభించింది.  వెంటనే అతడు పాండ్యరాజును కలుసుకుని జరిగిందంతా చెప్పాడు.  రాజు మహదానందంతో అక్కడ ఒక అద్బుతమైన ఆలయాన్ని నిర్మించాడు.  దాని చుట్టూ ఒక నగరం ఏర్పడింది అదే విల్లిపుత్తూరు.  గోదాదేవి అవతరించిన కారణంగా శ్రీవిల్లిపుత్తూర్ అయ్యింది. 
 
పూర్వం  హిరణ్యాక్షుడిని వధించిన స్వామి, ఇక్కడ వటపత్రశాయిగా వెలసి  విశ్రమించాడు.  అలా విశ్రమించిన స్వామి భూదేవి కోరికపై ఆమెకు ప్రత్యక్షమైన ఈ రూపంలోనే ఇప్పటికీ  భక్తులను అనుగ్రహిస్తున్నాడు. 
 భృగు, మార్కండేయుడు మొదలగు విష్ణుభక్తులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ తాపసులను కాలనేమి రాక్షసుడు చాలా  హింసించేవాడు.  అతడి బాధలు పడలేక మహర్షులు,  శ్రీహరిని ప్రార్థించారు స్వామి ప్రసన్నుడై కాలనేమికి సంహరించమని సుదర్శన చక్రాన్ని పంపించాడు.   కాలనేమిని వధించిన ఆ సుదర్శనుడు  మునుల బాధలను తొలగించాడు. సుదర్శునుడికి అంటుకున్న రాక్షసుడి  రక్తం కడగడానికి గంగా , యమునా, సరస్వతులు కలసి  ఒక పుష్కరిణిగా మారాయి. అందులో సుదర్శనుడు స్నానం చేసి ఆ రక్తం అంటుకున్న తన శరీరాన్ని  శుద్ధిచేసుకున్నాడు. అంతేకాక భక్తులందరూ తనని దర్శించడానికి వీలుగా ఈ పవిత్ర పుష్కరిణి ఒడ్డున అర్చామూర్తిగా కొలువై ఉన్నాడు.

పుణ్యక్షేత్రంలో   గోదాదేవి మాలలు సంర్పించిన వటపత్రశాయి ఆలయం, దాంతోపాటుగా  గోదాదేవి రంగమన్నార్ ఆలయాలు కూడా ఉన్నాయి.  
      
ఈ దివ్యక్షేత్రంలో ఉండే తులసివనంలోనే  గోదాదేవి విష్ణుచిత్తునకు లభించింది.  చిన్నప్పటినుండి తండ్రివద్ద భాగవతాన్ని విన్న ఆ తల్లి  శ్రీకృష్ణుడి మీద ఎనలేని ప్రేమతో, ఆ నీలమేఘశ్యాముడే తన భర్త అని భావించి, తదేకంగా ఆరాధిస్తూ వుండేది. విష్ణుచిత్తులు భగవంతునకు కట్టిన పూలమాలికలను గోదాదేవి ధరించి,  స్వామికి తగినట్లు ఉన్నానా లేదా అని తన ప్రతిబింబాన్ని చూచుకొని ఆనందించేది.  ఆ తర్వాత తండ్రిగారి ఆజ్ఞపై ధనుర్మాసవ్రతాన్ని ఆచరించింది.  శ్రీవిల్లిపుత్తూరే  రేపల్లెగా తన తోటివారే గోపికలుగా వటపత్రశాయి ఆలయమే నందుని గృహంగా, అందులో పవళించిన వటపత్రశాయే శ్రీకృష్ణ భగవానుడుగా భావించి, ఈ వ్రతాన్ని ఆచరించింది. భూదేవి అంశతో అవతరించి స్వామిపై తిరుప్పవై నాచ్చియార్ తిరుమోళి అని రెండు ప్రబంధాలను పాడి శ్రీరంగనాథుని వివాహం చేసుకున్నది.   

వటపత్ర శాయి ఆలయ గోపురాన్ని పాండ్యరాజు వల్లభదేవుడు నిర్మించాడు. ఇది పదకొండు అంతస్థులతో నూట తొంభై ఆరు అడుగుల ఎత్తుతో మేరుపర్వతంలా అద్భుతంగా ఉంటుంది. శేషశయనుడైన  వటపత్రశాయి పాదాల వద్ద శ్రీ భూదేవులు సేవ చేస్తూ ఉంటారు.  నాభిలో పద్మం అందులో బ్రహ్మ,  శిరస్సు వద్ద గరుడుడు విష్వక్సేనుడు ఉంటారు. 
గోదాదేవి కళ్యాణం సమయంలో శ్రీరంగనాథుడు శ్రీరంగం నుండి రావడానికి సమయం మించిపోతుండగా గరుత్మంతుడి అవతారమైన విష్ణుచిత్తులవారి ప్రార్థన మీద గరుడుడు శ్రీరంగనాథుని తీసుకుని వచ్చాడు.   
అందుచేత ఇక్కడ స్వామి,అమ్మవార్లతో పాటు గరుత్మంతుడు అదే ఆసనం మీద మనకు దర్శనమిస్తాడు.  
       
        శ్రీవిల్లిపుత్తూరులో జూన్ నెలలో బ్రహ్మోత్సవం. ఫాల్గుణ మాసములో ఉత్తరా నక్షత్రంనాడు గోదా రంగమన్నారు కల్యాణం మహా వైభవంగా జరుగుతుంది.