పొందూరు: మండలంలోని గారపేట గ్రామానికి చెందిన అంబల్ల సంతోష్‌ (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరో యువకుడు చీమల మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం
మండలంలోని రెడ్డిపేట వద్ద జరిగింది. మృతుని బంధువులు, పోలీసుల కథనం ప్రకారం..దుర్గారావు, లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో సంతోష్‌ (19) పెద్ద కుమారడుడు, కుమార్తె
తులసి, చిన్న కుమారుడు వినోద్‌కుమార్‌ ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గురువారం రక్షాబంధన్‌ పండగ కావడంతో లావేరు మండలంలోని చిన్నయ్యపేట
గ్రామంలో ఉంటున్న చీమల మణికంఠ (సంతోష్‌ పెద్దమ్మ కుమారుడు) గారపేటకు వచ్చాడు. సంతోష్, మణికంఠలకు తులసీ రాఖీ కట్టింది. వీరిద్దరూ రాఖీ కట్టించుకునేందుకు శ్రీకాకుళంలోని
ఉంటున్న స్వాతి (మణికంఠ అక్క) ఇంటికి ద్విచక్రవాహనంపై గారపేట నుంచి బయలుదేరారు. సంతోష్‌ బైక్‌ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. వెనుక మణికంఠ కూర్చున్నాడు. సుమారు రెండు కిలోమీటర్లు
దూరంలో వెళ్లారు. రెడ్డిపేట వద్ద ముందు వెళ్తున్న లారీని క్రాస్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా వెనుక నుంచి వచ్చిన క్వారీ లారీ బలంగా ఢీకొట్టింది. ఇరువురు రోడ్డుపై పడిపోయారు. లారీ అతివేగంగా
రావడంతో సంతోష్‌ తలపై నుంచి వెళ్లింది. సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు మణికంఠకు కాలు విరిగింది. మణికంఠను 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విషయం
తెలుసుకున్న సంతోష్‌ తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా పడివున్న కుమారుడిని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మృతి చెందిన అన్నయ్యను చూసిన చెల్లి
తులసీ, తమ్ముడు వినోద్‌లు బోరున విలపించారు. అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరితరమూ కాలేదు.వారి ఆవేదనను చూసిన ప్రజలు
కంట తడిపెట్టారు. మృతుడు సంతోష్‌ పొందూరు మండల కేంద్రంలోని సిస్టం కళాశాలలో బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. మంచి విద్యార్థిగా గుర్తింపు పొందాడు. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో
పాల్గొని ఎంతో సంతోషంగా గడిపాడు. సంతోష్‌ మృతి చెందాడన్న విషయాన్ని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంతోష్‌ మృతితో గారపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన
స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ మహ్మద్‌ యాసిన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.